టోక్యో: జపాన్ శాటిలైట్ పరీక్ష విఫలమైంది. ఆ దేశానికి చెందిన స్పేస్ వన్ కంపెనీ ఇవాళ కైరోస్ రాకెట్(Japan Kairos Rocket)ను ప్రయోగించింది. ఉపగ్రహాలను మోసుకెళ్తున్న ఆ రాకెట్.. నింగిలోకి వెళ్లిన తర్వాత విఫలమైంది. ఆ కంపెనీ రాకెట్ విఫలం కావడం 9 నెలల్లో ఇది రెండోసారి. సెంట్రల్ జపాన్‌లో ఉన్న వకయామా పర్వత శ్రేణుల నుంచి రాకెట్ లిఫ్టాఫ్ అయ్యింది.
అయితే మిషన్ పూర్తి చేయడంలో రాకెట్ విఫలం అయిన్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు జపాన్ ఈ రాకెట్‌ను ప్రయోగించింది. నిజానికి శనివారం జరగాల్సిన ప్రయోగం.. బలమైన గాలుల వల్ల బుధవారానికి వాయిదా పడింది. మార్చిలో జరిగిన ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. అప్పుడు టేకాఫ్ తీసుకున్న 5 సెకన్లలోనే ఆ రాకెట్ పేలింది.
ఇవాళ జరిగిన పరీక్షలో.. లిఫ్టాఫ్ తర్వాత కైరోస్ రాకెట్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. కైరోస్ ఓ చిన్నతరహా, ఘన ఇంధనంతో ఎగిరే రాకెట్. తక్కువ ఖర్చులో పేలోడ్స్‌ను నింగికి మోసుకెళ్లే రీతిలో ఈ రాకెట్‌ను డిజైన్ చేశారు. ఇవాళ ఎగిరిన రాకెట్ 5 చిన్నతరహా శాటిలైట్లను మోసుకెళ్లింది.