Elderly Women | టోక్యో, జనవరి 19: అక్కడి గదులన్నీ వృద్ధులతో నిండి ఉన్నాయి. వారి చేతులు ముడతలు పడ్డాయి. నడుములు వంగిపోయాయి. కొంతమంది నడిచేందుకు అవస్థలు పడుతున్నారు. మరికొందరు వాకర్స్ వాడుతున్నారు. వారికి అక్కడి సిబ్బంది సాయం చేస్తున్నారు. ఇదంతా చూసి అదేదో వృద్ధాశ్రమం అనుకుంటే మీరు పొరబడినట్టే. అది జపాన్లోని అతిపెద్ద మహిళా కారాగారం. ఆ దేశంలోని వృద్ధ జనాభాకు ఈ జైలులోని పరిస్థితులే నిదర్శనం.
పేదరికం, ఒంటరితనం కారణంగా జపాన్లోని చాలామంది వృద్ధ మహిళలు బయట బతకలేక చిన్నచిన్న నేరాలు చేస్తూ జైళ్లకు వెళ్లేందుకు కూడా వెనకాడటం లేదు. మరికొంతమందికి సిరులు ఉన్నా బాగోగులు చూసుకునే దిక్కు లేక నెలకు 20-30 వేల యెన్ల వరకు చెల్లించి మరీ జైలుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. దీన్నిబట్టే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
జైలు జీవితం గడిపాక బయటికి వస్తున్నవారి ప్రవర్తనలో పెద్దగా మార్పు రావడం లేదు. బయట వారి బాగోగులు చూసుకునే వ్యక్తులు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారి సంక్షేమానికి చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. అయితే, ఈ సమస్య కొంతమందికి ఉపాధి మార్గంగా మారింది. వయసు పైబడిన వారి బాగోగులు చూసుకునే కేర్ టేకర్లకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2040 నాటికి ఈ రంగంలో పని చేసేందుకు 2.72 మిలియన్ల మంది అవసరం.
ఓఈసీడీ నివేదిక ప్రకారం.. 65 ఏండ్లు పైబడిన జపాన్ మహిళల్లో 20 శాతం మంది కడు పేదరికంలో మగ్గుతున్నారు. కనీసం తిండి పెట్టే దిక్కులేక చాలామంది మహిళలు దొంగతనాలు చేసి జైళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల్లో ఎక్కువ మంది చేసిన నేరం దొంగతనం కావడం గమనార్హం. ఆదేశ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2022లో జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల్లో సుమారు 80 శాతం చోరీలకు పాల్పడినవారే. 2003 నుంచి 2022 మధ్యకాలంలో 65 ఏండ్లకు పైబడిన ఖైదీల సంఖ్య నాలుగింతలైంది.