Human Washing Machine | టోక్యో, డిసెంబర్ 3: బట్టలు ఉతికి ఆరేసినట్టు మనుషులను కూడా ఉతికి ఆరేసే ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్లు’ భవిష్యత్తులో రాబోతున్నాయి. బాగా అలసిపోయిన వ్యక్తి స్నానం చేసే ఓపిక లేకపోతే.. మెషీన్‌లోని టబ్‌లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు! కొద్ది నిమిషాల తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు రావొచ్చు! మెషీన్‌లోని ‘ఏఐ’ (కృత్రిమ మేధ) వ్యక్తి శరీరం, చర్మం తీరును పరిగణనలోకి తీసుకొని వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ నిర్ణయిస్తుంది. జపాన్‌కు చెందిన ‘సైన్స్ కో’ కంపెనీ ఇంజనీర్లు ఈ మెషీన్‌ను తయారుచేసినట్టు ‘డెయిలీ మెయిల్’ కథనం పేర్కొన్నది. ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పోలో 1,000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవటానికి ఏర్పాట్లు జరిగాయి.
ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వర్షన్‌ను విడుదల చేస్తామని ‘సైన్స్ కో’ కంపెనీ చైర్మన్ ఆయోమా వెల్లడించారు. మనుషుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జపాన్ ఇంజినీర్లు దీనిని తయారుశారు. అయితే.. ఈ మెషీన్ డిజైన్ 50 ఏండ్ల క్రితం నాటిది. 1970లో జపాన్ వరల్డ్ సాన్యో ఎలక్ట్రిక్ కో (ప్రస్తుతం పానసోనిక్) దీనిని మొదటిసారి తయారుచేసింది. దాంతో పోల్చితే కొత్త వెర్షన్లో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్టు తయారీదారులు పేర్కొన్నారు.
ఫైటర్‌జెట్ కాక్‌పీట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్‌లోకి మనిషి ప్రవేశించాక, అది సగానికిపైగా గోరువెచ్చని నీరు నిండుతుంది. ఆ తర్వాత అందులోని హైస్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరజిమ్ముతుంది. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపర్చేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయట. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మెషీన్ సేకరిస్తుందట.