Smallest Park | టోక్యో: వాకింగ్కో, పచ్చదనం మధ్య సరదాగా గడపడానికో, సేద తీరడానికో అందరూ పార్కులకు వెళ్తుంటారు. అయితే జపాన్లోని షిజువోకా సెంట్రల్ ఫ్రిఫెక్చర్లో ఉన్న ఒక పార్కులో అలాంటి పరిస్థితి లేదు. అక్కడ వాకింగూ చేయలేం, సరదాగా కుటుంబ సభ్యులతో గడపలేం. ఎందుకంటే దాని విస్తీర్ణం కేవలం 2.6 చదరపు అడుగులు మాత్రమే. దీంతో ఇది ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
దాదాపు నాలుగు కాగితపు షీట్ల పరిణామంలో ఉన్న స్థలంలో ఒక రాతి దిమ్మె, దానిపై చెక్కతో తయారు చేసిన స్టూల్, దాని చుట్టూ చిన్న పొద ఏర్పాటు చేసి దానినే పార్కుగా పేర్కొన్నారు. ఈ పార్కు 1988 నుంచి ఉన్నప్పటికీ, ఇటీవలే యంత్రాంగం దానిని అధికారికంగా గుర్తించడంతో అతి చిన్న పార్కుగా గిన్నిస్ రికార్డులకెక్కింది.