న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్(Maulana Masood Azhar) సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో మృతిచెందాడు. అనుమానాస్పద రీతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. బవాహల్పుర్లో ఉన్న జామియా మజ్జీద్ ఉస్మాన్ వాలీ వద్ద అన్వర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నిషేధ ఉగ్ర సంస్థ పేర్కొన్నది. మసూద్ అజార్‌కు మొత్తం అయిదుగురు అన్నాదమ్ములు ఉన్నారు. అందులో అన్వర్ ఒకరు. జైషే ఉగ్ర సంస్థలో అతను కీలక పాత్ర పోషించాడు. టెర్రర్ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా అతను పాల్గొనేవాడు.
గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో.. మసూద్ అజార్‌కు చెందిన పది మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బవాహల్పుర్ జేషే కార్యాలయంపై జరిగిన దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలుతో పాటు మరో అయిదు మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2001 పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడిలో మసూద్ నిందితుడిగా ఉన్నాడు.