ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 48 గంటల్లోగా తమ 38 డిమాండ్లపై చర్య తీసుకోకుంటే భారీగా తుది దశ నిరసనలు చేపడుతామని జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ లీగ్ (జేఏఏసీ) పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 45 సీట్లున్న అజాద్ కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి.
అయితే కశ్మీర్ శరణార్థులకు కేటాయించిన 12 సీట్లు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జూలై 9న ప్రారంభం కావాల్సి ఉంది. పాకిస్థాన్‌లో స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేస్తున్నది. ఈ స్థానాలు పీవోకే రాజకీయాలపై ఇస్లామాబాద్‌కు అసమానమైన పట్టును లభించేలా చేస్తుందని వాదిస్తూ వస్తున్నది. వీటిని రద్దు చేయాలంటూ కోర్టునూ ఆశ్రయించింది.