వాషింగ్టన్, జూన్ 19 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో తనతో ఫొటో తీసుకోవాలంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వేడుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే మెలోనీ ఈ వ్యాఖ్యలను వెంటనే తోసిపుచ్చారు. అది పూర్తిగా కల్పితమంటూ ఆమె కొట్టిపారేశారు. ఇరాన్‌తో యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడికి, ఇటలీ ప్రధానికి మధ్య విభేదాలు పొడసూపాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని మెలోనీ వ్యతిరేకించడంతో కొంతకాలంగా ట్రంప్ ఆమెపై ఆగ్రహాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశానికి వీరు ఉభయులూ హాజరయ్యారు. అనంతరం ఇటాలియన్ టెలివిజన్ చానెల్ లా7కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మెలోనీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తనతో ఫొటో తీసుకోవాలని మెలోనీ ప్రాధేయపడినట్టు ఆయన చెప్పారు. కాగా, ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మెలోనీ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక వీడియోను షేర్ చేశారు. ట్రంప్ చెప్పింది పూర్తి కట్టుకథని ఆమె పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు తన మిత్రదేశాల గురించి ఇలాంటి అగౌరవపూరిత వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదని ఆమె అన్నారు. ట్రంప్ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. నేను గానీ, ఇటలీ గానీ ఎన్నడూ యాచించము అంటూ ఆమె తన వీడియో సందేశాన్ని ముగించారు.