Giorgia Meloni | ఇటలీ నూతన ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కొత్త వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాలకే రెండు ప్రధాన వివాదాలు ఆమె మెడకు చుట్టుకున్నాయి. జార్జియా మెలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ వివాదాలకు కారణంగా నిలిచాయి. దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
తొలి మితవాద ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన జార్జియా మెలోనీ.. గలిజ్జో బిగ్నామీని మంత్రిగా నియమించారు. నాజీ ఆర్మ్ బ్యాండ్ (స్వస్తిక్ గుర్తు) ధరించి బిగ్నామీ 2005 లో మీడియా కెమెరాలకు చిక్కాడు. దీనికి అప్పట్లోనే ఆయన క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఆయన తీరుపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. తాజాగా మెలోని ఆయనను మంత్రిగా నియమించడంతో ఇటలీవాసులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నాజీ వారసుడిగా గుర్తింపు పొందాలని తాపత్రయపడుతున్న వ్యక్తిని ఇటలీ మంత్రిగా ఎలా నియమిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ తీసుకోని వైద్యులపై విధించిన నిషేధాన్ని జార్జియా మెలోనీ ఎత్తివేశారు.
ఇలాఉండగా, రేవ్ వంటి పార్టీలను నిషేధిస్తూ తీసుకువచ్చిన చట్టాన్ని మెలోనీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రేవ్ పార్టీలు, అటువంటి సమావేశాలకు అనుమతి ఉండదు. రేవ్ పార్టీలను చట్టవిరుద్ధమైనవిగా గుర్తిస్తారు. డీజే మ్యూజిక్ పార్టీలపై కూడా నిషేధం వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే డీజే మ్యూజిక్ పార్టీల నిర్వాహకులకు 3 నుంచి 6 ఏండ్ల వరకు శిక్ష పడుతుంది. దేశంలో మత్తు పదార్థాల వాడకం తగ్గించేందుకు, లైంగిక నేరాలు జరుగకుండా చూడటం ఈ చట్టం ముఖ్యోద్దేశమని ప్రభుత్వం వాదిస్తున్నది.
ఇలాఉండగా, మెలోనీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రాజ్యాంగం కల్పించిన పౌరుల హక్కులను ప్రమాదంలో పడేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం ముసుగులో బహిరంగ సమావేశాలను నిరోధించే అవకాశాలు ఉంటాయని, అలాగే భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని భయపడుతున్నారు. దేశం ఖజానా ఖాళీగా ఉన్నదని, పలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని నిపుణుడు ఫ్రాన్సిస్కో క్యాన్సెల్లాటో అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణంను అదుపులో ఉంచలేకపోవడం, ఇంధన ధరలను తగ్గిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆయన చెప్పారు.