Iran warning : ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్‌లపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు చేసింది. ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఎలాంటి దాడులు జరగకూడదని, అలా జరిగితే ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడతామని హెచ్చరించింది.
ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ (Abbas Araqchi) వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీంతో ఇరాన్ పెద్దతప్పు చేసిందని, మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.
ఇరాన్ అణుస్థావరాలపైనే ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తంచేశారు. అయితే అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై ఇరాన్ సుప్రీంలీడర్, సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా వెనకడమని అన్నారు.