గాజా: నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్‌లో యూదుల రక్తం ఉన్నట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇజ్రాయిల్ సీరియస్ అయ్యింది. ఓ ఇటలీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్రోవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూద మతానికి చెందినా… ఆ దేశం మాత్రం నాజీలా వ్యవహరిస్తుందన్న వైఖరిలో రష్యా విదేశాంగ మంత్రి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ ఇవాళ రష్యా అంబాసిడర్‌కు సమన్లు జారీ చేసింది. లవ్రోవ్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని కోరింది. రష్యా దీనిపై క్షమాపణలు చెప్పాలని కూడా ఇజ్రాయిల్ డిమాండ్ చేసింది.
రష్యా మంత్రి లవ్రోవ్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయిల్‌లో అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఆ దేశ పత్రికలు కూడా లవ్రోవ్ వ్యాఖ్యలను ప్రదానంగా ప్రచురించాయి. రష్యా మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఉక్రెయిన్ యుద్ధంలో ఇజ్రాయిల్ ఇక తటస్థంగా ఉండలేదని జెరుసలాం పోస్టు పత్రిక అభిప్రాయపడింది. కీవ్‌లో కాదు.. మాస్కోలో డినాజిఫికేషన్ కావాలని కోరుతున్నట్లు అమెరికా యూదుల కమిటీ మరో పత్రిక హరేజ్లో అభిప్రాయపడింది.