జెరూసలెం : ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం మొట్టమొదటిసారి తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. 2002లో ఆపరేషన్ డిఫెన్సివ్ షీల్డ్ ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెలీ సైన్యం తన యుద్ధ ట్యాంకులను వెస్ట్ బ్యాంకులో మోహరించడం ఇదే మొదటిసారి. ఆ ప్రాంతంలో తమ సైనిక కార్యకలాపాలను బలోపేతం చేసేందుకే ఈ చర్యని ఇజ్రాయెల్ తెలిపింది. ఉత్తర సమరియా(వెస్ట్ బ్యాంకు)లో ఉగ్రవాదాన్ని అణచివేయడం, తమ సైనిక బలాన్ని విస్తరించడం కోసం ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) తమ కార్యకలాపాలను అక్కడ కొనసాగిస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం ఎక్స్ వేదికగా ఆదివారం వెల్లడించింది.
వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనా శరణార్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో యుద్ధ ట్యాంకుల ఆగమనంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని ఇళ్లు, కట్టడాలను ఇజ్రాయెల్ కూల్చివేస్తుండడంతో వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారుతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 60 మంది ఈ ప్రాంతంలో మరణించారు.