డెయిర్ అల్-బలహ్, అక్టోబర్ 10: గాజా స్ట్రిప్‌లో షెల్టర్‌గా వాడుతున్న ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 27 మంది మరణించారని పాలస్తీనా వైద్యాధికారులు గురువారం తెలిపారు. డెయిర్ అల్-బలహ్లో జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే పౌరుల వెనుక దాక్కొన్న మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని తాము దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఆ స్కూల్లో మిలిటెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహిస్తున్నారని ఆరోపించింది. గాజాల్లోని పాఠశాలలు మిలిటెంట్లకు ఆశ్రయాలుగా మారుతున్నాయని.. అందుకే వాటిపై మళ్లీ మళ్లీ దాడులు చేస్తున్నామని తెలిపింది. సాధారణంగా భద్రత కల్పించే హమాస్ పోలీసులుండే గదిలో సహాయ బృంద ప్రతినిధితో స్కూల్ మేనేజర్లు సమావేశమైనప్పుడు ఈ దాడి జరిగిందని… దాడి సమయంలో అక్కడ పోలీసులు ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.