గాజా: గాజా స్ట్రిప్‌పై విస్తృత స్థాయిలో ఇజ్రాయిల్(Israeli Military) భీకర దాడులు చేస్తున్నది. ఆ దాడుల్లో సుమారు 220 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. హమాస్ టెర్రర్ కేంద్రాలను టార్గెట్ చేస్తున్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళం పేర్కొన్నది. తాజా దాడిలో హమాస్ సెక్యూర్టీ అధికారి మహమూద్ అబూ వఫా హతమైనట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. జనవరి 19వ తేదీన కుదిరిన కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత గాజాలో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
సుమారు 20 ఇజ్రాయిలీ యుద్ధ విమానంలో అటాక్‌లో పాల్గొన్నాయి. గాజా సిటీ, రఫా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లోని హమాస్ కేంద్రాలను ఆ దాడి ద్వారా టార్గెట్ చేశారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ, రక్షణ మంత్రి ఇజ్రేల్ కట్జ్.. మంగళవారం ఉదయం దాడులకు ఆదేశించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. బంధీలను విడుదల చేసేందుకు హమాస్ నిరాకరించడంతో.. ఇజ్రాయిల్ మళ్లీ వైమానిక దాడులకు దిగింది. సైనిక చర్యను మరింత పెంచనున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ ఉల్లంఘించినట్లు హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడితో బంధీల భవిష్యత్తు ఆంధకారంలోకి వెళ్తుందని హమాస్ పేర్కొన్నది. అయితే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హమాస్ ఇంకా ప్రకటించలేదు. ఇజ్రాయిల్ దూకుడును అడ్డుకునేందుకు మధ్యవర్తులు, ఐకరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని హమాస్ కోరినట్లు తెలుస్తోంది. హమాస్‌పై దాడికి ముందు అమెరికా సర్కారుకు ఆ విషయాన్ని చర్చించినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.