Israeli bombs : గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel) బాంబు దాడులు (Bomb attacks) కొనసాగుతున్నాయి. హమాస్ (Hamas) తో ఉద్రిక్తతల నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తోంది. శనివారం అర్థరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై టెల్ అవీవ్ వైమానిక దాడులు జరపడంతో ఖాన్ యూనిస్‌లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 10 మంది సహా మొత్తం 125 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రకటించారు.
మొత్తం మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారని, వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగినప్పటి నుంచి 3 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడినట్లు అక్కడి విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇదిలావుంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు తెలిపారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు నిరాకరించిందని అన్నారు. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.