ఖాన్యూనిస్, నవంబర్ 15: గాజాలోని అత్యంత పెద్ద దవాఖాన అయిన షిఫా దవాఖానలో ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెట్టాయి. ఈ దవాఖానలో చిన్న పిల్లలతో సహా వందల మంది రోగులు ఉన్నారు. హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల కోసం దవాఖానలో తనిఖీలు చేసినట్టు సైనికులు చెప్తున్నారు. కానీ ఈ దవాఖానలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానంతోనే తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తున్నది. మరోవైపు అంధకారంలో ఆహారం లేక నలిగిపోతున్న గాజా ప్రజలకు విడతల వారీగా సాయాన్ని అందజేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఐక్యరాజ్యసమితి ద్వారానే పరిమిత స్థాయిలో ఈ సాయాన్ని కొనసాగించాలని సూచించింది. ఇంకోవైపు గాజాపై పట్టు సాధించే దిశగా ఇజ్రాయెల్ సైనికులు అడుగులు వేస్తున్నారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర భవనాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.