దుబాయ్ : యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని వెల్లడిస్తూ హొర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు మరి కొంత వ్యవధిని ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క ప్రకటించగా ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేసి విస్తరిస్తామని మరోపక్క ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఇరాన్ కూడా తగ్గే సూచనలు ఏవీ కనిపించడం లేదు. స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండటం, యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పరిణామాలు పశ్చిమాసియాను దాటి చాలా దూరం విస్తరించడంతో హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించాలని ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. జలసంధిపై నియంత్రణను వదులుకోవడంతోపాటు కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన 15 అంశాల ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అమెరికా అదే సమయంలో హొర్ముజ్ జలసంధిని ఇరాన్ నుంచి చేజిక్కించుకునేందుకు సైనిక చర్య కోసం వేలాది బలగాలను పశ్చిమాసియాకు పంపాలని కూడా ట్రంప్ నిర్ణయించారు. ఏప్రిల్ 6 నాటికి జలసంధిని తెరవకపోతే ఇరాన్ ఇంధన ప్లాంట్లను ధ్వంసం చేయాలని తాను ఆదేశిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని ట్రంప్ ప్రకటించగా అసలు సంప్రదింపులేవీ జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ శుక్రవారం దాడులు ముమ్మరం చేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చివేయడమే రోజువారీ పనిగా నడుస్తున్నదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు ఉధృతం చేస్తామని, ఆయుధాల తయారీ, వాడకంలో సాయపడుతున్న ప్రాంతాలు, భవనాలపై అదనపు దాడులు జరుగుతాయని కట్జ్ తెలిపారు. టెహ్రాన్‌లో బాలిస్టిక్ క్షిపణులు, ఇతర ఆయుధాలు తయారు చేసే భవనాలపై శుక్రవారం దాడులు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమ ఇరాన్లో క్షిపణి లాంచర్లు, నిల్వ ప్రదేశాలపై కూడా దాడులు జరిపినట్లు కట్జ్ చెప్పారు. లెబనాన్ రాజధాని బీరుట్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో ఇద్దరు మరణించారు.
రియాద్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కువైట్ నగరంలోని షువైఖ్ పోర్టు, చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న ముబారక్ అల్ కబీర్ పోర్టు ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నట్లు కువైట్ తెలిపింది. గల్ఫ్‌లో చైనాకు చెందిన ప్రాజెక్టుపై దాడి జరగడం ఈ యుద్ధంలో ఇదే మొదటిసారి.
ఇజ్రాయెల్‌లో జరిగిన దాడుల్లో 18 మంది మరణించగా లెబనాన్‌లో నలుగురు ఇజ్రాయెలీ సైనికులు చనిపోయారు. లెబనాన్‌లో ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులు కూడా గాయపడినట్లు అధికారులు చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత లెబనాన్‌లో 1,100 మందికిపైగా మరణించగా ఇరాన్లో 1,900 మంది మరణించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో నలుగురు అమెరికన్ సైనికులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గల్ఫ్, అరబ్ దేశాల్లో 20 మంది మరణించారు. ఇరాన్ బలపరుస్తున్న ఇరాక్‌లోని తీవ్రవాద గ్రూపులు జరిపిన దాడుల్లో 80 మంది సైనికులు మరణించారు.