Israel vs Hamas : గాజాలో హమాస్ మిలిటెంట్ సంస్థ చేతికి బందీలుగా చిక్కిన వారిలో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయిల్ ఆదివారం స్పష్టంచేసింది. దక్షిణ గాజా నగరం రఫాలో సొరంగం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
తాము అక్కడికి చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు హమాస్ ఉగ్రవాదులు వారిని దారుణంగా హత్య చేశారని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మీడియాతో చెప్పారు. మృతుల్లో ఇజ్రాయెల్-అమెరికన్ అయిన 23 ఏళ్ల హెర్ష్ గోల్డ్బర్గ్ పొలిన్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ బృందం (IDF) తెలిపింది.
గోల్డ్బర్గ్ పొలిన్ను విడిపించాలంటూ అతని తల్లిదండ్రులు ప్రపంచ దేశాల నేతలను కలిశారు. గత నెలలో జరిగిన డెమోక్రటిక్ కన్వెన్షన్‌లో కూడా అతనిని విడుదల చేయాలంటూ ఒత్తిడి చేశారు. గోల్డ్బర్గ్ మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ధ్రువీకరించారు. అతడి మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేరాలకుగానూ హమాస్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
హమాస్ చెరలో ఉన్న మిగతా బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య సత్వర ఒప్పందం కుదిరేలా కృషి చేస్తామని బైడెన్ చెప్పారు. ఆరుగురు బందీల హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బందీల కుటుంబాల సమాఖ్య భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. బందీల విడుదల కోసం హమాస్‌పై ఒత్తిడి చేసేలా దేశాన్ని పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది.