టెహ్రాన్, జెరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శనివారం మరోసారి పరస్పర వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. టెహ్రాన్, ఇతర నగరాల్లోని కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. ఇస్ఫహాన్ నగరంలోని అణ్వయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు తయారు చేసే అణు కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఎలాంటి విష వాయువులు లీక్ కానట్టు తెలిసింది. ఇజ్రాయెల్ దాడులతో ఇస్ఫహాన్ నగరం దద్దరిల్లింది.
ఖొండాబ్ అణు పరిశోధన రియాక్టర్ సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఇరాన్ పేర్కొంది. మరోవైపు తమ సైనిక దళాలు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్సుకు చెందిన కుద్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్ సయీద్ ఇజాదీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ శనివారం వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ నేవీ లెబనాన్‌కు చెందిన నకౌరా నగర సమీపంలో హిజ్బుల్లా స్థావరంపై దాడి చేసినట్లు ఆయన చెప్పారు.
ఇంకోవైపు ఇజ్రాయెల్‌కు దక్షిణాన ఉన్న హైఫా బీర్షేబా నగరాలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులలో కనీసం 19 మంది ఇజ్రాయెలీ పౌరులు గాయపడ్డారు. గత శుక్రవారం రెండు దేశాల మధ్య ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్లో 657 మంది మరణించగా 2,000 మందికిపైగా గాయపడ్డారని మానవ హక్కుల వార్తా సంస్థ తెలిపింది. మా సాయం లేకుండా అణు కేంద్రాల
తమ సాయం లేకుండా శత్రు దుర్భేద్యమైన ఇరాన్ భూగర్భ అణు పరిశోధనా కేంద్రాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్, తన ప్రాంతీయ శత్రువైన ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు పరిస్థితుల ఆధారంగా మద్దతు తెలియచేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో యూరప్ పెద్దగా సహాయం ఏమీ చేయలేదని ఆయన చెప్పారు. ‘యూరప్‌తో మాట్లాడేందుకు ఇరాన్ ఇష్టపడడం లేదు. అందుకే మాతో మాట్లాడాలని భావిస్తోంది. ఈ విషయంలో యూరప్ నుంచి సాయం ఏదీ సాధ్యపడదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌ని ఓడించాలంటే గ్రౌండ్ ఫోర్సెస్ అవసరమా అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ..గ్రౌండ్ ఫోర్సుల గురించి తాను మాట్లాడదలచుకోలేదని, చివరిగా మాట్లాడాల్సింది గ్రౌండ్ ఫోర్సులతోనని అన్నారు.
ఉత్తర ఇరాన్‌లోని సెమ్నన్ ప్రాంతంలో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. 5.1 తీవ్రతతో సెమ్నన్కు నైరుతి దిశలో 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. 18 కిలోమీటర్ల లోతున భూమిలో ఇది కేంద్రీకృతమైంది. అయితే, ఇరాన్ అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించిందా అన్న ఊహాగానాలు ఈ భూకంపంతో ఏర్పడ్డాయి. అంతరిక్ష, క్షిపణి సముదాయం గల నగరానికి సమీపంలో భూకంపం సంభవించడం కూడా కలవరపాటుకు గురిచేస్తోంది.
ఇరాన్ సైన్యం నిర్వహిస్తున్న సెమ్నన్ అంతరిక్ష కేంద్రం, సెమ్నన్ క్షిపణి సముదాయం ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. భూకంపం కారణం గా ప్రాణ నష్టం ఏదీ జరగలేదని ఇరాన్ వార్తాసంస్థ ఇర్నా తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన న్యూక్లియర్ శాస్త్రవేత్త ఇసార్-తబతాబాయి-కమ్షే, ఆయన భార్య మరణించినట్టు రాయిటర్స్ వెల్లడించింది.