గాజా : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మంగళవారం గాజా పట్టణాన్ని సందర్శించారు. అరుదైన తన పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఇక గాజాను హమాస్ ఎన్నడూ తిరిగి పరిపాలించ లేదని స్పష్టం చేశారు. బందీగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థను అంతం చేయడానికి మరోసారి ప్రతిజ్ఞ చేసిన ఆయన ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే హమాస్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీశాయని చెప్పారు. ఇక హమాస్ తిరిగి రాబోదని స్పష్టం చేశారు. గాజాలో బందీలుగా ఉన్న 101 మంది ఇజ్రాయెల్ పౌరుల కోసం తమ గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు. ‘బందీగా ఉన్న వారిని అప్పగిస్తే ప్రతి ఒక్కరికీ 5 మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తాం. మీదే నిర్ణయం. అయితే ఎట్టి పరిస్థితుల్లో బందీలనందరినీ సురక్షితంగా వెనక్కి తెస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.