ఐరాస, సెప్టెంబర్ 26: హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నప్పటికీ తాను వెనక్కి తగ్గేదే లేదని, తన వైఖరిలో మార్పు రాదని నెతన్యాహు శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధి సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రసంగానికి ఆయన సిద్ధమవుతుండగానే, పలు దేశాల ప్రతినిధులు సమావేశం నుంచి వాకౌట్ చేయడం కన్పించింది.
అయినప్పటికీ నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హాలులో అర్ధం కాని అరుపులు ప్రతిధ్వనించాయి. అదే సమయంలో ఆయన ప్రసంగానికి ప్రోత్సాహకరంగా కొన్ని వర్గాల నుంచి చప్పట్లు మోగాయి. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పలుసార్లు ప్రశంసలు కురిపించారు. హమాస్ అంతానికి గాజాలో తాము ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు.