జెరుసలాం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు యుద్ధం ప్రకటించి 20 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ మీడియాతో మాట్లాడారు. శుద్ధీకరించిన యురేనియంను తయారు చేసే సామర్థ్యం కానీ, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే సామర్థ్యం కానీ ఇరాన్ ఇక లేదని ఆయన అన్నారు. యుద్ధం మొదలై 20 రోజులు అయ్యిందని, మీకో విషయం చెబుతున్నానని, యురేనియం శుద్ధీకరణ, బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తిలో ఇరాన్‌కు ఇక ఆ సామర్థ్యం లేదన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు అకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా చిత్తు చేస్తున్నామని, ఆ సామర్థ్యం బూడిదయ్యే వరకు ఆ పనిచేస్తామని నెతన్యూహూ హిబ్రూ భాషలో పేర్కొన్నారు. గతంలో కన్నా ఇప్పుడు ఇరాన్ చాలా బలహీనంగా తయారైందన్నారు. ప్రాంతీయంగా ఇప్పుడు ఇజ్రాయెల్ శక్తివంతమైందన్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచ శక్తి అని కొందరంటున్నట్లు ఆయన చెప్పారు. అయితే నెతన్యహూ మాట్లాడిన కొన్ని గంటల్లోనే గురువారం ఇరాన్ తన క్షిపణి దాడిని కొనసాగించింది. ఇజ్రాయెల్ రాజధానిలో హెచ్చరిక సైరన్లు మోగాయి.
ఇంగ్లీష్ భాషలోనూ నెతన్యహూ మాట్లాడుతూ.. గత జూన్‌లో చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్‌తో ఇరాన్‌లోని క్షిపణులను ధ్వంసం చేశామని, అణ్వాయుధ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు చెప్పారు. అయితే క్షిపణులకు, న్యూక్లియర్ వెపన్స్‌కు అవసరమైన పరికరాలను తయారు చేసే కంపెనీలను ఇప్పుడు ధ్వంసం చేస్తున్నామని ఆయన అన్నారు. గతంలో చేయని రీతిలో ఇప్పుడు ఇరాన్ ఇండస్ట్రియల్ బేస్‌ను కూల్చుతున్నామన్నారు. అయతుల్లా ఖమేనీతో పాటు అనేక మంది ఇరానీ అగ్రనేతల్ని చంపిన తర్వాత.. ఇప్పుడు ఇరాన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలియదన్నారు. అలీ ఖమేనీ వారసుడిగా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీ ఇప్పుడు వరకు తన ముఖాన్ని చూపలేదన్నారు. త్వరలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లో మార్పు మొదలవుతుందన్నారు.