Israel New Law : ఉగ్ర దాడుల (Terror attacks) కు పాల్పడిన పాలస్తీనీయుల (Palstenians) కు మరణశిక్ష (Death Penalty) విధించేలా ఇజ్రాయెల్ పార్లమెంట్ (Israel Parliament) కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దాదాపు పన్నెండు గంటల చర్చ తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం.. ఉగ్రదాడులకు పాల్పడిన వారందరికీ మరణశిక్ష విధించే అధికారం అక్కడి కోర్టులకు ఉంటుంది. శిక్ష విధించిన 90 రోజులలోపు ఆ శిక్షను అమలుచేయాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది.
ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని ఓ ప్రాంతంపై హమాస్ చేసిన ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ దాడులకు పాల్పడిన నిందితులకు ఈ చట్టం వర్తించదన్నారు. ఇజ్రాయెల్ పౌరులు, నివాసితులను ఈ చట్టం నుంచి మినహాయించినప్పటికీ.. ప్రత్యేక నిబంధన ప్రకారం ఉగ్ర కార్యకలాపాలతో ఒక వ్యక్తి మరణానికి కారణమైన ఇజ్రాయెలీలకు సైతం ఈ చట్టం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. సొంత చట్టాలను ప్రవేశపెట్టుకొనే హక్కు ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు ఉందని పేర్కొంది. కాగా సుదీర్ఘ సమావేశం అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. దాంతో ఆ దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. సాధారణంగా ప్రభుత్వ పదవీకాలం పూర్తికాకముందే ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నిర్వహిస్తారు. నెతన్యాహు ప్రభుత్వం నాలుగేళ్ల పదవీకాలం మరికొన్ని నెలల్లో పూర్తి కానుంది. అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం.