జెరూసలేం, జూన్ 27: గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో రెడ్ వెడ్డింగ్ గుర్తుందా? దానిని గుర్తు చేసే తరహాలోనే జూన్ 13న సైనిక జనరల్స్ ఆధ్వర్యంలో అసలే మాత్రం ఊహించని ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ మెరుపుదాడి ప్రణాళికను అమలు చేసి ఇరాన్‌ను చావు దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. ఆ దేశ టాప్ మిలిటరీ కమాండర్లను హతమార్చింది. దీనికి సమాంతరంగా ఆపరేషన్ నార్నియా కూడా అమలు చేసి ఇరాన్‌కు చెందిన అత్యంత ప్రముఖులైన 9 మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఈ ఆపరేషన్ల వివరాలను ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ హెడ్ మేజర్ జనరల్ ఓడెడ్ బాస్యుక్.. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు వెల్లడించారు.
ఈ ప్రణాళిక అంతా రాత్రికి రాత్రే అమలు పరిచింది కాదని, ఇరాన్ అణు కార్యక్రమాలు ప్రారంభించిన 1990ల్లోనే దీనికి బీజం పడిందన్నారు. అనేకసార్లు ఇజ్రాయెల్ పూర్తి స్థాయి దాడికి దగ్గరగా వచ్చినా ప్రధాని బెంజమిన్, మంత్రివర్గం, భద్రతా అధిపతులు పదేపదే అడ్డుకున్నారన్నారు. ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం జరిగితే అమెరికాతో సంబంధాలు తెగిపోతాయని వారు భయపడ్డారు. అయితే 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడితో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. తర్వాత తాము చేసిన దాడులతో హమాస్, హెజ్బొల్లాలను నిర్వీర్యం చేశామన్నారు. అమెరికా పచ్చజెండా ఊపకుండా ఇజ్రాయెల్ తమపై దాడికి దిగదన్న ఇరాన్ దృఢ నమ్మకాన్ని తొలగించాలని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు భావించి దాడులు జరిపి విజయవంతంగా రెండు ఆపరేషన్లు పూర్తి చేశారని ఆయన చెప్పారు.