టెల్ అవీవ్: ఒక పక్క హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 72 మంది పౌరులు మృతి చెందినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఇది గాజాలోని రెండు దవాఖానలకు తీసుకువచ్చిన మృత దేహాల సంఖ్య అని, వాస్తవానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది. ‘నిన్న రక్తసిక్తమైన రోజు.. ఈ రోజు మరింత రక్తసిక్తమైన రోజు’ అని రిజిస్ట్రేషన్ శాఖ చీఫ్ జహేర్ అల్ వాహెదీ పేర్కొన్నారు.
కాగా, కాల్పుల విరమణకు కొన్ని గంటల ముందు ఇరు వర్గాలు తమ సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ వెల్లడించిన తర్వాత దీనిపై కొన్ని సమస్యలున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. గాజా స్ట్రిప్‌లో హమాస్ బందీలుగా ఉన్న డజన్ల మంది పౌరుల విడుదల, గాజాతో యుద్ధం నిలుపుదలకు ఉద్దేశించిన చిరకాల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ఆమోదాన్ని ఆఖరి నిమిషం సంక్షోభం అడ్డుకుందని ఆయన పేర్కొన్నారు.