న్యూఢిల్లీ, జూన్ 19 : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంతో పశ్చిమాసియాలో తన సైనిక బలగాలను అమెరికా మోహరిస్తున్నది. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించి, ఆ ప్రాంతంలోని అమెరికా దళాలను కాపాడే లక్ష్యంతో అమెరికా ఈ చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలగాల మోహరింపు నిజమేనని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధ్రువీకరించారు. తమ ప్రజల భద్రత కోసమే ఈ చర్యలని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలోని వ్యూహాత్మక ప్రదేశాలకు అదనంగా ఫైటర్ జెట్లు, రీఫ్యూయెలింగ్ ట్యాంకర్లు, యుద్ధ నౌకలను అమెరికా రక్షణ శాఖ పంపించి రానున్న రోజుల్లో తమ ప్రమేయం కూడా ఉంటుందన్న సూచనలు పంపింది. ఇరాన్ గగనతలంపై ఇప్పుడు తమకు పూర్తి నియంత్రణ ఏర్పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా గురువారం ప్రకటించారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు ఆస్కారం ఉందని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు అమెరికా యుద్ధ విమానాలేవీ ఇరాన్ గగనతంలోకి ప్రవేశించలేదని అమెరికన్ అధికారులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్న ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇప్పటి వరకు కార్యకలాపాలు సాగుతున్నాయని వారు చెప్పారు.
సౌదీ అరేబియాలో అమెరికాకు చెందిన డజను ఎఫ్-16 విమానాలను మోహరించగా పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా ఫైటర్ జెట్లు విహంగ పర్యవేక్షణ చేస్తున్నాయి. బీ-52 బాంబర్లు డైగో గార్షియాలో సిద్ధంగా ఉన్నప్పటికీ అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబుగా పిలిచే బీ-2 స్టెల్త్ బాంబర్స్ని చివరి అస్త్రంగా ఇప్పటి వరకు మోహరించలేదు. పర్వతాల కింద లోతుగా భూగర్భంలో ఇరాన్ నిర్మించిన ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేసే శక్తి గల జీబీయూ-57 క్షిపణిని అమెరికా ప్రయోగించవచ్చని అమెరికా అధికారులు వెల్లడించారు. ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు అవసరమైన విమానం, మందుగుండు అమెరికా వద్ద ఉందని వారు చెప్పారు. బ్రిటన్, స్పెయిన్, జర్మనీ, గ్రీస్తోసహా యూరపు వ్యాప్తంగా వ్యూహాత్మక ప్రదేశాలలో అదనంగా రీఫ్యూయలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను అమెరికా వైమానిక దళం మోహరించినట్లు పశ్చిమాసియాలో రియల్ టైమ్‌లో లభించే సమాచారాన్ని సమీక్షించే అరోరా ఇంటెల్ అనే గ్రూపు తెలిపింది.
ఇరాన్‌పై దాడికి ట్రంప్ తర్జనబర్జనలు పడుతున్న వేళ, వాషింగ్టన్కు డూమ్స్‌డే విమానం చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నైట్‌వాచ్ అని పిలుస్తారు. అమెరికా కీలక మంత్రులు, అధికారులను రక్షించేందుకు దీన్ని నిర్మించారు. అణుదాడి సమయంలో అమెరికా రక్షణ మంత్రి సహా కీలక కార్యవర్గం అత్యధిక సమయంలో గాల్లో ఉండేందుకు నిర్మించిన ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ ఇది.