Israel | జెరూసలేం, నవంబర్ 28: హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, సరిహద్దులో సామాన్యులు తిరిగి స్వస్థలాలకు చేరుకోవటాన్ని ఇజ్రాయెల్ బలగాలు అడ్డుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో అనుమానిత వ్యక్తులు దక్షిణ లెబనాన్ ప్రాంతంలోకి వస్తున్నారని, ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కిందకే వస్తుందని ఐడీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని కంటే కొద్ది గంటల ముందు ‘హెజ్బొల్లా’ నుంచి కూడా ముఖ్యమైన ప్రకటన ఒకటి విడుదలైంది. ఇజ్రాయెల్ బలగాలను అంతమొందించటం కోసం తమ ఫైటర్స్ కాచుకొని ఉన్నారని తెలిపింది.
గురువారం దక్షిణ లెబనాన్‌లోని ఆరు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైనిక ట్యాంక్‌లు దాడులు నిర్వహించాయి. అలాగే అదే ప్రాంతంలో మధ్యశ్రేణి రాకెట్లను నిల్వ చేయడానికి హెజ్బొల్లా వినియోగించే స్థావరంలో ఉగ్రవాద కార్యక్రమాలు గుర్తించామని, వాటిని తమ వైమానిక దళం అడ్డుకుందని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. తమ ఆర్మీ బలగాలు ఇంకా దక్షిణ లెబనాన్‌లోనే ఉన్నాయని, కాల్పుల విరమణ ఒప్పంద షరతులను అతిక్రమించకుండా అవి చూస్తాయని పేర్కొంది.
ఫ్రాన్స్, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్బొల్లా నాయకులకు మధ్య కుదిరిన కాల్పుల విరమణ బుధవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దులో శరణార్థులుగా మారిన ప్రజలంతా తిరిగి తమ సొంత ప్రాంతాలకు వస్తున్నారు. యుద్ధం కారణంగా దక్షిణ లెబానాన్ను వీడి వెళ్లిపోయిన వేలాదిమంది తిరిగి తమ ఇండ్లను వెతుక్కుంటూ వస్తున్నారు. అయితే సరిహద్దులో ఐడీఎఫ్ బలగాలు వారిని అడ్డుకుంటున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ నిఘా డ్రోన్లు ఎగురుతున్నాయని ‘రాయిటర్స్’ కథనం పేర్కొన్నది.