న్యూఢిల్లీ: ప్రతికారదాడులతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. క్షిపణి కేంద్రాలు, డ్రోన్ల తయారీ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా వందకుపైగా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆ దేశ మిసైల్స్‌లో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తున్నది. టెహ్రాన్ సమీపంలో ఉన్న పర్చిన్ మిలటరీ కాంప్లెక్స్‌లో డ్రోన్ల తయారీ యూనిట్‌ను ఐడీఎఫ్ దళాలు ధ్వంసం చేశాయి. అదేవిధంగా ఖోజిర్లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రం కూడా పూర్తిగా దెబ్బతితన్నది.
అయితే ఖెబర్, హజ్ ఖాసీం బాలిస్టిక్ మిసైల్స్‌లో వినియోగించే ఘన ఇంధనాన్ని తయారు చేసే కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తున్నది. ఇవే క్షిపణులను ఇజ్రాయెల్‌పై దాడికి గతంలో ఇరాన్ వినియోగించింది. ఈ కర్మాగారం ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌కు వెన్నెముకగా భావిస్తారు. ఇజ్రాయెల్ దాడితో అది పనికిరాకుండా పోయింది. ఇక్కడ దాదాపు 20 హెవీ ఫ్యూయల్ మిక్సర్లు ధ్వంసమయ్యాయి.
ఒక్కోదాని ఖరీదు 2 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఇక్కడ ఆ మిక్సర్లను తిరిగి అమర్చాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని ఐక్యరాజ్యసమితి వెపన్స్ ఇన్స్పెక్టర్ డేవిడ్ ఆల్బర్ట్, డెకర్ ఎవలెంత్ అనే సీఎన్ఏ పరిశోధకుడు తెలిపారు. పర్చిన్ సహా మరోచోట బాలిస్టిక్ మిసైల్ కాంప్లెక్సులు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో మూడు భవనాలు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఘన ఇంధనం మిక్సర్‌ను తయారీ, ఎగుమతి చేయడంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ మిక్సర్లను ఇరాన్ భారీగా సొమ్ము వెచ్చించి దిగుమతి చేసుకొంది. దీంతో ఇరాన్ పెద్ద మొత్తంలో క్షిపణులు తయారు చేసే సామర్థ్యంపై దెబ్బపడినట్లైందని పేర్కొన్నారు.కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు సైనికులు సహా నలుగురు మృతి చెందినట్టు ఇరాన్ తెలిపింది. తమ క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇతర సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడి జరిపిందని, దీనికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇలాం, ఖుజెస్థాన్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు ఇతర ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరిగాయని, నష్టం పరిమితంగానే ఉందని తెలిపింది. తమ విమాన సైనిక వ్యవస్థను యాక్టివేట్ చేశామని, పలు ఇజ్రాయెల్ రాకెట్లను కూల్చి వేశామని ఇరాన్ సైన్యం తెలిపింది. కాగా, ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ గగనతలాలను మూసివేస్తున్నట్టు ఇరాన్, ఇరాక్, సిరియాలు ప్రకటించాయి. టెహ్రాన్‌లో శనివారం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు ఇరాన్‌కు చెందిన టీవీ నిర్ధారించింది. ఇరాన్‌పై దాడి జరగడానికి కొద్ది సేపు ముందే దాడి గురించి వైట్ హౌస్ వర్గాలు గుర్తించినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది.