టెహ్రాన్, ఏప్రిల్ 6: ఇరాన్లో అతిపెద్ద చమురు, సహజవాయు క్షేత్రం ‘సౌత్ పార్స్’పై ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులకు పాల్పడింది. సౌత్ పార్స్ పెట్రోకెమికల్ ప్లాంట్’పై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డామని, చాలా శక్తివంతమైన బాంబుదాడులు జరిపామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కట్జ్ సోమవారం ప్రకటించారు. ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తిలో 50 శాతం సౌత్ పార్స్ ప్లాంట్ నుంచే వస్తున్నది. మార్చిలోనూ సౌత్పార్స్ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడగా, ఇదంతా తమకు తెలియకుండా జరిగిందని, మరోసారి ఈ తప్పు జరగదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయినా.. ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగటం గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.
గల్ఫ్ చమురు క్షేత్రాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశముంది. ముడి చమురు సరఫరాను ఇది తీవ్రంగా దెబ్బతీయవచ్చు. సముద్రంపై 9,700 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన ఈ సహజవాయు క్షేత్రంలో, ఇరాన్ వైపు భాగాన్ని సౌత్ పార్స్‌గా, ఖతార్ వైపు భాగాన్ని ‘నార్త్ డోమ్’గా పేర్కొంటారు.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)కి చెందిన నిఘా విభాగాధిపతి మజీద్ ఖాదెమీని ఇజ్రాయెల్ వైమానిక దళం అంతం చేసినట్లు కట్జ్ సోమవారం ప్రకటించారు. ఇరాన్ నాయకులు ఒక్కొక్కరిని వరుసగా వేటాడతామని కూడా ఆయన హెచ్చరించారు. ఇరాన్ నగరాలపై ఆదివారం నుంచి సోమవారం వరకు అమెరికా-ఇజ్రాయెలీ సేనలు జరిపిన దాడులలో 25 మందికిపైగా మరణించారు. టెహ్రాన్‌లోని నివాస ప్రాంతాలపై సోమవారం తాజా దాడులు జరగగా పాలనా లక్ష్యాలపై జరిపిన వరుస దాడులు పూర్తయ్యాయని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది. టెహ్రాన్‌లోని ఓ యూనివర్సిటీపైనా దాడి జరిగింది.