Yahya Sinwar | హమాస్‌ను ఇజ్రాయెల్ చావుదెబ్బ కొట్టింది. హమాస్‌కు చెందిన కీలక నేతను ఇజ్రాయెల్ మట్టుపెట్టినట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) గాజాలో నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు హమాస్ ఫైటర్లను మట్టుపెట్టినట్లు ప్రకటించింది. మృతుల్లో యాహ్యా సిన్వర్ ఉన్నట్లు తెలుస్తున్నది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడికి ఆయన సూత్రధారి. ఈ క్రమంలో చనిపోయింది యాహ్యా సిన్వరే? కాదా? అన్న దానిపై ఐడీఎఫ్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతున్నది. అయితే, ఐడీఎఫ్ ఇప్పటి వరకు మృతుల గుర్తింపును అధికారికంగా ప్రకటించలేదు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా మృతులను గుర్తించనున్నట్లు ప్రకటించింది. కొద్దిరోజుల కిందట లెబనాన్‌లో వైమానిక దాడుల్లో హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన క్రమంలోనే.. తాజాగా గాజాలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. అంతకుముందు ఇరాన్లో జరిగిన దాడిలో హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియ్య ప్రాణాలు కోల్పోయాడు. టెహ్రాన్, హమాస్‌పై ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అయితే, హనియ్యపై దాడిపై స్పందించలేదు. ఆయన తర్వాత హమాస్ రాజకీయ విభాగానికి చీఫ్‌గా యాహ్యా సిన్వర్ నియామకయ్యారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులకు సిన్వర్ సూత్రధారిగా భావిస్తున్నారు. ఇటీవల గాజాలోని హమాస్ ప్రభుత్వ అధిపతి రౌహి ముష్తాహా, హమాస్ రాజకీయ కార్యాలయంలోని భద్రతా విభాగం అధిపతి సమా అల్-సిరాజ్‌తో సహా పలువురు హమాస్ ఉన్నతాధికారులను ఐడీఎఫ్ హతమార్చింది. గత మూడు రోజుల్లో జబాలియాలో జరిగిన వైమానిక దాడుల్లో సుమారు 20 మంది హమాస్ ఆపరేటర్లు మరణించారని గత మంగళవారం ఐడీఎఫ్ తెలిపింది. ఆయుధ డిపో, ఇతర ఆయుధాలను సైతం ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో తీవ్రవాద గ్రూపు మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేసే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
యాహ్యా సిన్వర్ గాజా స్ట్రిప్‌లోని హమాస్ అగ్ర నాయకుడు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ప్రధాన సూత్రధారి యాహ్యా సిన్వర్గా భావిస్తున్నారు. సిన్వర్ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరున్నది. ఆయన దాదాపు 24 సంవత్సరాలపాటు ఇజ్రాయెల్‌లో జైలు జీవితం గడిపారు. ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్‌ను విడిచిపెట్టేందుకు.. ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలైన 1,027 మంది పాలస్తీనా ఖైదీల్లో యాహ్యా సిన్వర్ ఒకడు. ఆయన ఇరాన్‌కు మద్దతుదారుడని.. హమాస్ రాడికల్ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ మట్టుబెట్టాలనుకుంటున్న హమాస్ నేతల్లో యాహ్యా సిన్వర్ పేరు సైతం ఉన్నది. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇప్పటికీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా నుంచి మొదలైన యుద్ధం ఇప్పుడు లెబనాన్, ఇరాన్‌కు పాకింది.