Israel | గాజా, టెల్అవీవ్, నవంబర్ 2: లెబనాన్, గాజాలపై ఇజ్రాయెల్ తన పోరు కొనసాగిస్తున్నది. లెబనాన్ ఈశాన్య ప్రాంతంలోని వ్యవసాయ గ్రామాలపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు గురువారం ఒక దవాఖాన లక్ష్యంగా సెంట్రల్ గాజాలో జరిపిన దాడుల్లో 25 మంది పౌరులు మరణించారు. మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్న క్రమంలో గాజా సంక్షోభానికి తాత్కాలికంగా తెర దించడానికి ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగానే ఇజ్రాయెల్ తన దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. కాగా, ఇజ్రాయెల్ లోని టైరా పట్టణంపై శనివారం తెల్లవారుజామున లెబనాన్ జరిపిన దాడుల్లో 11 మంది గాయపడినట్టు ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. లెబనాన్ నుంచి మూడు క్షిపణులు ప్రయోగించారని, వాటిని తిప్పికొట్టినట్టు వెల్లడించింది.
ఇజ్రాయెల్ సైనిక నిఘా కేంద్రం గ్లిలోట్ బేస్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు హెజ్బొల్లా శనివారం ప్రకటించింది. టెల్ అవీవ్ సమీపంలోని గ్లిలోట్ బేస్ నుంచి శనివారం రాత్రి రాకెట్లతో దాడి చేశామని ఈ సంస్థ తెలిపింది.
ఇరాన్‌పై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌తోపాటు ఆ దేశానికి అండగా నిలుస్తున్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్‌పై, రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై దాడులు జరుపుతున్నవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, శత్రువులు జియోనిస్టు పాలకులైనా, అమెరికా అయినా కోలుకోలేని దెబ్బ కొడతామని హెచ్చరించారు. ఇస్లామిక్ విప్లవం అనంతరం 1979లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని 45 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.