బీరుట్, అక్టోబర్ 21: హెజ్బొల్లా ఆర్థిక వ్యవహారాలతో సంబంధాలున్న ప్రదేశాలపై దాడులు చేయనున్నామని, ఆ పరిసరాల్లోని వారు ఇండ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ లెబనాన్ ప్రజలను హెచ్చరించింది. దీంతో లెబనాన్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా బయలుదేరి సురక్షిత ప్రాంతాలవైపు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ హెచ్చరిక వెలువడిన వెంటనే లెబనాన్‌లోని పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజధాని నగరం బీరుట్ దక్షిణ ప్రాంతంలో భారీగా మంటలు లేచాయి. దీంతో భయాందోళన చెందిన ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి రావడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ‘లెబనాన్ వాసులారా!
హెజ్బొల్లా అల్ ఖర్ద్ అల్ హస్సన్ అసోసియేషన్‌కు సంబంధించిన వసతులపై దాడులు చేయనున్నాం. వాటి నుంచి దూరంగా వెళ్లిపోండి’ అంటూ ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హెజ్బొల్లా ఆర్థిక కార్యకలాపాలను అల్-ఖర్ద్ అల్ హస్సన్ సంస్థ నిర్వహిస్తున్నట్టు అమెరికా ఇటీవల వెల్లడించింది. ఆ సంస్థకు లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో 30 శాఖలున్నట్టు తెలిపింది. వాటిలో 15 శాఖలు సెంట్రల్ బీరుట్లో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రకటనపై హెజ్బొల్లా లేదా లెబనీస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. ఏడాది క్రితం పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి చేయడంతో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.