వాషింగ్టన్ డీసీ : అమెరికా, నైజీరియా దళాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్ సీనియర్ నేత అబూ బిలాల్ అల్ మినూకీని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘నా ఆదేశాల మేరకు ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక ఉగ్రవాదిని యుద్ధభూమి నుంచి అంతమొందించేందుకు అమెరికా, నైజీరియా సాయుధ దళాలు అత్యంత పకడ్బందీగా సంక్లిష్టమైన మిషన్‌ను పూర్తి చేశాయి’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఐసిస్‌లో రెండో అత్యున్నత నాయకుడైన అబూ బిలాల్ అల్ మినుకీ ఆఫ్రికాలో దాక్కోవచ్చని భావించాడు. అతని కదలికలపై ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందించే వర్గాలు ఉన్నాయన్న సంగతి అతనికి తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అతను ఇకపై ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలేడు. అలాగే అమెరికన్లను లక్ష్యంగా చేసుకునే దాడుల ప్రణాళికలో సాయం చేయలేడు’ అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో తమతో భాగస్వామ్యం వహించిన నైజీరియా ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో ఉనికిని చాటుకుంటున్న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో 2023లో అబూ బిలాల్‌పై యూఎస్ ఆంక్షలు విధించింది. కాగా 2023లో ప్రభుత్వం గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలో అతడి పేరును చేర్చినప్పుడు విదేశాంగ శాఖ ఐసిస్ సీనియర్ నాయకునిగా అతడిని పేర్కొన్నది.