ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్(Asim Malik)ను.. జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా అక్టోబర్ 2024లో మాలిక్‌ను నియమించారు. క్యాబినెట్ డివిజిన్ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా..జనరల్ మాలిక్‌కు ఎన్ఎస్ఏ బాధ్యతలు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది.
ఆసిమ్ మాలిక్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పాకిస్తాన్‌కు పదవ ఎన్ఎస్ఏగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న వ్యక్తికి.. మరో కీలక బాధ్యత అప్పగించడం ఇదే మొదటిసారి. జాతీయ భద్రతా సలహాదారు పోస్టు ఏప్రిల్ 2022 నుంచి ఖాళీగా ఉన్నది. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డాక్టర్ మోయిద్ యూసుఫ్ ఎన్ఎస్ఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.