Ishaq Dar : భారత సైన్యం (Indian army) తమపై దాడిచేస్తే ఎదురుదాడికి దిగుతామని ఇటీవల మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్థాన్ (Pakistan) ఇప్పుడు మాట మార్చింది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి (Pak foreign minister) ఇషాక్ దార్ (Ishaq Dar) శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితో ఆపితే తాము కూడా ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇరుదేశాల మధ్య దాడులవల్ల పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి కుదేలవుతుందని, ప్రజల పరిస్థితులు అధ్వాన్నంగా మారే ప్రమాదం ఉందని ఇషాక్ దార్ అన్నారు. ఈ యుద్ధ వాతావరణాన్ని రూపుమాపడం కోసం న్యూఢిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని దార్ అన్నట్లు అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి.
భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులు చేయిదాటకముందే దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరుదేశాలకు సూచించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
గురువారం రాత్రి నుంచి పాకిస్థాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో దుస్సాహసానికి ఒడిగడుతూనే ఉంది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు ప్రయోగించింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను ప్రయోగిస్తూ.. విఫలయత్నిం చేస్తుండగా, దాయాది చర్యలను భారత సైన్యం తిప్పి కొడుతోంది.