న్యూఢిల్లీ, జూలై 8 : పాకిస్థాన్‌లో మళ్లీ సైనిక తిరుగుబాటు జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చివేసి పరిపాలనా పగ్గాలను చేపట్టడం శక్తివంతమైన పాకిస్థాన్ సైన్యానికి కొత్తేమీ కాదు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీఓఏఎస్) జనరల్ అసిమ్ మునీర్ మధ్య విభేదాలు నానాటికీ తీవ్రతరం అవుతున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రభుత్వానికి, సైనిక నాయకత్వానికి మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నట్లు పలు పాక్ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. కాగా, పాక్ సైన్యం తిరుగుబాటు యోచనకు సబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఏర్పడిన ఘర్షణ వైఖరి అనేక ఊహాగానాలకు తావిస్తోంది. సైనిక నియామకాలు, పాలనాపరమైన ఆదేశాలపై జర్దారీ, మునీర్ మధ్య మొదటిసారి విభేదాలు వెలుగుచూశాయని ఫస్ట్‌పోస్ట్ వెల్లడించింది.
2024 మార్చిలో రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జర్దారీ రాజ్యాంగపరంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం పట్ల సైన్యంలో అసంతృపి నెలకొన్నట్లు సమాచారం. సీనియర్ అధికారుల నియామకాలు, పోస్టింగులు, విదేశాంగ విధానం వంటి అంశాలలో తాను రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడిగా ఉండబోనని జర్దారీ తీసుకున్న వైఖరి సైన్యానికి మింగుడుపడడం లేదు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షుడు జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సైన్యాధిపతికి మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌లను భారత్‌కు అప్పగిద్దామంటూ బిలావల్ చేసిన ప్రతిపాదన పాక్‌లోని జిహాదీ గ్రూపులలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి.
ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. 1958, 1977, 1999లో ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు జరగగా పౌర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సైన్యం తెరవెనుక కుట్రలు అనేకం చేసింది. పాక్ స్వతంత దేశంగా ఏర్పడిన నాటి నుంచి సగం కాలం ప్రత్యక్షంగా లేక తమ మద్దతుతో నడిచే రాజకీయ కూటముల ద్వారా సైన్యమే పరిపాలన సాగించింది. 1999లో చివరిగా జరిగిన సైనిక తిరుగుబాటులో ప్రధాని నవాజ్ షరీఫ్‌ని సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ పదవీచ్యుతుడిని చేశారు. అంతకుముందు 1977లో ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో(ఆసిఫ్ అలీ జర్దారీ మామ)ని గద్దె దించి జనరల్ జియా ఉల్ హఖ్ సైనిక పాలన విధించారు. అయితే జాతీయ భద్రత, అవినీతి, రాజకీయ కల్లోలం సాకులుగా చూపి అప్పట్లో ఈ సైనిక తిరుగుబాట్లను సమర్థించుకోగా ఇప్పుడు మళ్లీ మీడియా, సైన్యం తిరిగి ఒక్కటవుతున్న సూచనలు కనపడుతున్నాయి.
జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా 2022లో నియమితులైన జనరల్ ఆసిమ్ మునీర్ పాక్ సైనిక గూఢచర్యం, పాక్ అత్యున్నత నిఘా సంస్థ ఐఎస్ఐలో అధికారిగా పనిచేసి విశేష అనుభవం గడించారు. జనరల్ ఖమర్ జావేద్ బజ్వా వివాదాస్పద పదవీకాలం తర్వాత మునీర్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పాక్ సైనిక చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం మునీర్‌కి దక్కింది. ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందిన మునీర్ సాయుధ దళాలలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యాన్నీ అందుకున్నారు. అధ్యక్షుడిగా జర్దారీని తప్పించి ఆ స్థానంలో తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తిని నియమించుకోవడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మునీర్ ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని వార్తలు వస్తున్నాయి.