దుబాయ్, మార్చి 20 : ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వినోద, పర్యాటక ప్రదేశాలపై దాడులు చేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ఇప్పటికీ తాము క్షిపణులు తయారుచేస్తున్నామని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి మూడు వారాలు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు అగ్ర నాయకులను కోల్పోయి, భారీ స్థాయిలో ఆయుధాలు, ఇంధన పరిశ్రమలను నష్టపోయిన ఇరాన్ నుంచి శుక్రవారం మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసంలో శుక్రవారం ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇరాన్ తన పొరుగు దేశాలైన గల్ఫ్‌లోని ఇంధన కేంద్రాలపై భీకర దాడులు కొనసాగించింది. నౌరుజ్గా పిలుచుకునే పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవలసిన ఇరానియన్లు ఈ ఏడాది యుద్ధ బీభత్సంలో మునిగిపోయారు.
యుద్ధంలో ఒత్తిడి పెంచేందుకు వేసే ఎత్తుగడలో భాగంగా ఇరాన్ తీవ్రవాద దాడులను ఎంచుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధంలో తమ అగ్ర నాయకులు, ఆయుధాలు, చమురు క్షేత్రాలను కోల్పోయిన ఇరాన్ సైనిక బలం క్షీణించిపోయిందని ఇజ్రాయెల్, అమెరికన్ నాయకులు చెప్పారు. ఈ నిస్పృహతోనే ఇలాంటి హెచ్చరికలు ఇరాన్ నుంచి వస్తున్నాయని వారు వ్యాఖ్యానించారు. ఇరాన్ నేవీ మునిగిపోయిందని, దాని వైమానిక దళం కుప్పకూలిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం విమర్శించారు. విధ్వంసక క్షిపణులను తయారుచేసే సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని కూడా ఆయన చెప్పారు.
నెతన్యాహు వ్యాఖ్యలను ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డు తోసిపుచ్చింది. యుద్ధ వాతావరణంలో కూడా మేము క్షిపణులను తయారుచేస్తున్నాము. వాటిని నిల్వచేసుకోవడంలో కూడా మాకు ఎటువంటి సమస్యలు లేవు. శత్రువుకు సర్ప్రైజ్లు ఎదురుకానున్నాయి అని పారామిలిటరీ గార్డు అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహ్మద్ నయీనీ హెచ్చరించారు. యుద్ధానికి త్వరితంగా ముగింపు లభించాలని ఇరాన్ కోరుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. శత్రువు పూర్తిగా నిర్వీర్యుడయ్యే వరకు యుద్ధం కొనసాగాలని శత్రువులు కోరుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే వైమానిక దాడిలో నయీనీ మరణించినట్లు ఇరానియన్ ప్రభుత్వ టీవీ ప్రకటించింది.
సౌదీ ఆరేబియాలోని రియాద్‌పై ఈ నెల 18న ఇరాన్ చేసిన దాడిలో భారతీయుడు ఒకరు చనిపోయారని భారత ఎంబసీ శుక్రవారం ప్రకటించింది. అతడి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. క్షిపణి శకలాలు పడి అతడు మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు భారతీయులు చనిపోయారని, ఒకరు అదృశ్యమయ్యారని ఎంబసీ తెలిపింది.
అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమంటూ శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే పునరుద్ఘాటించారు. అందువల్లే తమ దేశ భూభాగాన్ని అమెరికా యుద్ధ విమానాల మోహరింపునకు అనుమతించలేదని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం విషయంలో తాము కఠినమైన తటస్థ వైఖరి అనుసరిస్తున్నామని పార్లమెంట్‌కు తెలియజేశారు. సంయుక్త సైనిక విన్యాసాల తర్వాత భారత తీర ప్రాంతం నుంచి బయల్దేరిన మూడు ఇరాన్ యుద్ధ నౌకలు కొలంబో పోర్టులో ఆగాలనుకున్నాయని, ఇందుకోసం ఇరాన్ నుంచి ‘పోర్ట్ కాల్’ వచ్చిందని, అదే రోజు అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలను మట్టాలా ఎయిర్‌పోర్ట్‌లో మోహరిస్తామంటే.. ‘నో’ చెప్పానని అన్నారు.