Ali Khamenei : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు (Khamenei Funeral) వచ్చే నెల (జూలై) 9న జరగనున్నాయి. ఖమేనీ స్వస్థలమైన మషాద్ (Masshad) లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం (Iran Govt) ప్రకటించింది. జూలై 4 నుంచి ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) సైన్యాలు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ పై చేసిన దాడుల్లో ఖమేనీ మరణించారు. అయితే భీకర యుద్ధం కారణంగా ఆయన అంత్యక్రియలు వాయిదాపడుతూ వస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా కారణాలు, మొహర్రం మాసంలో ప్రజల సంతాప కార్యక్రమాలు ఉన్నందున ఈ అంత్యక్రియలు వాయిదాపడ్డాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన ‘మొహర్రం’ ప్రారంభంలో (జూన్ ఆరంభంలో) ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇరాన్ అంతకుముందు భావించింది. అయితే కర్బలా యుద్ధంలో (క్రీ.శ. 680) అమరులైన ప్రముఖ షియా నాయకుడు ఇమామ్ హుస్సేన్ స్మారకార్థం భక్తులు జరిపే వార్షిక సంతాప కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు వీలుగా ముహర్రం మొదటి వారం తర్వాతే ఈ అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు జూలై 9వ తేదీని ఖరారు చేశారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 2 కోట్ల (20 మిలియన్ల) మంది ప్రజలు హాజరవుతారని టెహ్రాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 37 ఏళ్లపాటు ఇస్లామిక్ రిపబ్లిక్కు నాయకత్వం వహించిన ఖమేనీ, ఫిబ్రవరి 28న మధ్య టెహ్రాన్‌లోని తన నివాసంలో మరణించారు. వాస్తవానికి మార్చి 4న జరగాల్సిన ఈ అధికారిక అంత్యక్రియల కార్యక్రమం, యుద్ధం కారణంగా వాయిదా పడింది.