జెరూసలేం, జూన్ 22: ఇజ్రాయెల్ నగరాలే లక్ష్యంగా ఇరాన్ చేపడుతున్న బాలిస్టిక్ క్షిపణి దాడుల్ని అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) ప్రకటించాయి. పశ్చిమ ఇరాన్‌లోని ఆరు బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్స్‌ను ధ్వంసం చేసినట్టు ‘ఎక్స్’ వేదికగా ఐడీఎఫ్ తెలిపింది. ఇరాన్‌కు చెందిన రెండు ఎఫ్-5 యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ప్రకటించింది.
ఇరాన్‌లోని డెజ్‌ఫుల్ విమానాశ్రయంలో ఎఫ్5 ఫైటర్ జెట్‌ను ధ్వంసం చేశామంటూ, బ్లాక్ అండ్ వైట్ వీడియో ఫుటేజ్‌ను ఇజ్రాయెల్ ఆదివారం విడుదల చేసింది. డెజ్‌ఫుల్, ఇస్ఫహాన్ విమానాశ్రయ కేంద్రాలు సహా పలు చోట్ల గగనతల దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. కాగా, యుద్ధంలో విమానాలు, ఇతర సామాగ్రి నష్టపోయినట్టు ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ఇరాన్లో తమ టార్గెట్స్ పూర్తిచేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆదివారం ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ దాడుల తర్వాత కూడా ఇరాన్లో మరిన్ని సైనిక ఆపరేషన్లు చేపడతామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ‘ఇరాన్లో మరికొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేసేంత వరకు మిలిటరీ ఆపరేషన్ కొనసాగిస్తాం’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి ఇఫ్పీ డిఫ్రిన్ చెప్పారు.
‘ఆదివారం నాటి అమెరికా దాడులతో ఇరాన్ అణు శుద్ధీకరణ కార్యక్రమం పూర్తిగా నాశనమైందని చెప్పటం తొందరపాటే అవుతుంది. దీనిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది’ అని ఆయన అన్నారు. ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులకు దిగిన కొద్ది గంటల్లోనే, ఏకైక అణు విద్యుత్ కేంద్రం ఉన్న బషర్ ప్రావిన్స్‌లో ఆదివారం భీకరమైన పేలుడు సంభవించినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. యాజ్డ్ ప్రావిన్స్‌లో వైమానిక దాడులు జరిగినట్టు ఇరానియన్ న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి.