Nasseri died @ Airport | పారిస్ విమానాశ్రయంలో నివసిస్తున్న ఇరాన్ జాతీయుడు మెహ్రాన్ కరీమీ నస్సేరి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. గుండెపోటుకు గురై ఆయన చనిపోయినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈయన గత 18 ఏండ్లుగా ఇదే ఎయిర్‌పోర్టులో నివసిస్తున్నాడు. ఈయనను ప్రేరణగా తీసుకుని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 2004 లో టామ్ హాంక్ హీరోగా ‘ది టెర్మినల్’ సినిమాను తెరకెక్కించాడు.
ఇరాన్ జాతీయుడైన మెహ్రాన్ కరీమి నస్సేరీ పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో దాదాపు 18 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. టెర్మినల్ 2ఎఫ్‌లో శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు. సరైన నివాస పత్రాలు లేని కారణంగా 1988 లో ఆయనను పారిస్‌లోకి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. దాంతో ఆయన విమానాశ్రయం టెర్మినల్‌లోనే నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి శరణార్థి పత్రాలు మంజూరైనప్పటికీ వాటిపై సంతకం చేయడానికి నస్సేరి నిరాకరించాడు. దాంతో అప్పటి నుంచి చార్లెస్ డి గల్లే విమానాశ్రయంలోనే ఉండిపోయాడు.
తన వస్తువులను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ మూల పెట్టుకుని అక్కడే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడు. ఏరోజుకారోజు తన అనుభవానుల డైరీలో రాసుకుంటూ గడిపాడు. ఎక్కువ సమయాన్ని ఆర్థికశాస్త్రం పుస్తకాలను చదవడానికి కేటాయించాడు. 2006 లో ఆరోగ్య సమస్యలు రావడంతో కొన్నిరోజులపాటు ఆయన విమానాశ్రయాన్ని వీడారు. ఆరోగ్యం మెరుగవగానే తిరిగి ఇదే ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. నస్సేరి తండ్రి ఇరానియన్, తల్లి స్కాటిష్. రాజకీయ ఉద్యమాలు చేపట్టడంతో ఆయనను ఇరాన్ ప్రభుత్వం జైళ్లో పెట్టింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనకు దేశ బహిష్కరణ విధించారు. దాంతో శరణార్థిగా ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేకుండా పారిస్ చేరుకుని లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అతడ్ని పోలీసులు పట్టుకుని వెనక్కి పంపారు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు చార్లెస్ డి గల్లే ఎయిర్‌పోర్ట్‌లో నివసించాడు.