Shamim Mafi : అగ్రరాజ్యం అమెరికా (USA) లో స్థిరపడిన ఇరాన్ (Iran) సంతతి మహిళా వ్యాపారవేత్త, 44 ఏళ్ల షమీమ్ మాఫి (Shamim Mafi) అరెస్టు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ఆరోపణలపై యూఎస్ అధికారులు ఆమెను శనివారం రాత్రి లాస్ ఏంజిలెస్ (Los Angeles) విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఆరోపణలు రుజువైతే దాదాపు 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు ‘మొహాజెర్-6’ సాయుధ డ్రోన్లను సరఫరా చేసేందుకు ఆమె ఏకంగా 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. 2025లోనే ఈమె కంపెనీకి 7 మిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు జరిగినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. 2022 నుండి 2025 వరకు ఆమె ఇరాన్ నిఘా విభాగంతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ రికార్డులను పోలీసులు కోర్టు ముందు ఉంచారు. సూడాన్ రక్షణ శాఖకు 55 వేల బాంబు ఫ్యూజ్లను సరఫరా చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ వెళుతున్న సమయంలోనే ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండి ఇరాన్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు తేలడం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.