న్యూఢిల్లీ : లెబనాన్‌పై దాడులు ఆపకపోతే అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ ఆదివారం హెచ్చరించింది. లెబనాన్‌తో సహా అన్ని వైపులా యుద్ధాన్ని ముగించటం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తొలి ఒప్పందంలో భాగంగా ఉంది. అయినప్పటికీ, లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాల్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు జరపటం అమెరికాతో శాంతి ఒప్పందంపై సందేహాల్ని పెంచింది. ‘లెబనాన్‌తో యుద్ధాన్ని ముగించాలన్నది మొదటి నిబంధన. దీనిని అమల్లోకి తీసుకురాకుండా చర్చ ల్ని ప్రారంభించటం కుదరదు’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
రాబోయే 60 రోజలు కాల్పల విరమణ వ్యవధి ముగిసిన తర్వాత కూడా ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరని పక్షంలో హార్ముజ్ జల సంధి గుండా ప్రయాణించే నౌకలపై అమెరికా పన్నులను విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హెచ్చరించారు. అలాగే ఈ వారం ప్రారంభంలో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో పేర్కొన్న కాల్పుల విరమణ సమయంలో ఎటువంటి రుసుములు వసూలు చేయబోమని ఆయన తన ‘ట్రూత్ సోషల్’లో స్పష్టం చేశారు.
ఒకవేళ ఒప్పందం కుదరని పక్షంలో మధ్య ప్రాచ్య దేశాలకు ‘గార్డియన్ ఏంజిల్’గా సేవలు అందించినందుకు గాను గత, ప్రస్తుత, భవిష్యత్తు ఖర్చుల రీయింబర్స్మెంట్ నిమిత్తం అమెరికా పన్నులను విధిస్తుందన్నారు. బుధవారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి, దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘యాక్సియోస్’ కథనం ప్రకారం ఇరాన్ అధికారులతో చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ వెళ్లారు.