టెహ్రాన్, ఏప్రిల్ 3: పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతమైంది. ఇరాన్ ఉగ్రరూపం దాల్చింది. శత్రుదేశాలపై శనివారం భీకరదాడులకు దిగింది. అమెరికాకు చెందిన ఎఫ్15ఈ ఫైటర్ జెట్‌ను నేలకూల్చింది. దీంతో యుద్ధ విమానంలోని ఇద్దరు పైలట్లు కిందకు దూకేశారు. వీరిలో ఒకరిని అమెరికా రక్షించినట్టు ఇజ్రాయెల్ మీడియా కథనాలు తెలిపాయి. మరొకరి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నాయి. అయితే పైలట్ల రెస్క్యూ కోసం వచ్చిన అమెరికా జెట్‌ను కూడా కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. పైలట్లను పట్టుకున్న వారికి భారీ రివార్డు అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. మరోవైపు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. కువైట్‌లోని ఆయిల్ రిఫైనరీ, డీశాలినేషన్ ప్లాంట్ (ఉప్పు నీటి శుద్ధి కేంద్రం)పై దాడులు చేసింది. దుబాయ్‌లోని ఒరాకిల్ డాటా సెంటర్‌పైనా విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌లోని మొస్సాద్ హెడ్‌క్వార్టర్స్‌పై క్షిపణులతో దాడి చేసింది.

ఇదివరకే అమెరికాకు చెందిన కీలక యుద్ధ విమానం ఎఫ్-35 జెట్‌ను నేలకూల్చి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసిన ఇరాన్.. తాజాగా ఎఫ్-15ఈ జెట్‌ను కూల్చివేసింది. ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌ను ఉటంకిస్తూ ప్రభుత్వ ఆధీనంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ జెట్ కూల్చివేత విషయాన్ని వెల్లడించింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ జెట్‌ను లక్ష్యంగా చేసుకుని కూల్చివేసిందని తెలిపింది. కూల్చివేత సమయంలో జెట్‌లో పైలట్‌తో పాటు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ (డబ్ల్యూస్ఓ) కూడా ఉండగా, వీరిద్దరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఒకరు ఇరాన్ కస్టడీలో ఉన్నట్టు ఇరాన్‌కు చెందిన కొన్ని చానల్స్ పేర్కొనగా, పైలట్ కోసం గాలింపు జరుగుతున్నదని మరికొన్ని తెలిపాయి. ఇద్దరిలో ఒకరిని అమెరికా రక్షించినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన మీడియా తెలుపగా, ఇద్దరు క్రూను కూడా సురక్షితంగా ఇరాన్ నుంచి రక్షించి తరలించినట్టు ఆ దేశానికే చెందిన చానల్-12 వెల్లడించింది. అయితే ఈ వార్తలు దేనినీ అధికారులు నిర్ధారించ లేదు. అమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సమాచారం ఇచ్చినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. పైలట్, వెపన్ ఆఫీసర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
తాము ధ్వంసం చేసిన ఫైటర్ జెట్ పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, వారిని పట్టుకున్నా, హతమార్చినా ప్రభుత్వం 60,000 డాలర్లు రివార్డు ఇస్తుందని అధికారులు ప్రకటించారు. పైలట్‌ను సజీవంగా అధికారులకు అప్పగించే పౌరులకు ప్రభుత్వం తగిన బహుమతి ఇస్తుందని ఇరాన్ చానల్ ప్రకటించింది. అలాగే విమానాల కూల్చివేతలో సహకరించాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. ‘శత్రు పైలట్ దొరికితే అతడిని సజీవంగా మిలిటరీకి లేదా అధికారులకు అప్పగించండి. మీకు గొప్ప బహుమతి, పరిహారం లభిస్తుంది. అలాగే విమానం కానీ, హెలికాప్టర్ కానీ గగనతలంలో కనిపిస్తే దానిని టార్గెట్ చేయడానికి ప్రయత్నించండి’ అని టీవీల్లో ప్రకటించారు.
పైలట్‌ను రక్షించడానికి అమెరికా యూఎస్-60 బ్లాక్ హాక్ చాపర్‌ను పంపగా, దానిని కూడా కూల్చివేసినట్టు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. జెట్ కూల్చివేతకు సంబంధించిన వీడియోను తస్నిమ్ న్యూస్ ప్రసారం చేసింది. కాగా, తొలుత తాము అమెరికన్ ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ అధికారులు ప్రకటించారు. అయితే అది ఎఫ్-35 కాదు, యూఎస్ ఎఫ్-15ఈ జెట్ అని వార్తలు రావడంతో గందరగోళం ఏర్పడింది. అయితే కూలిన విమాన శకలాలు, వీడియోలోని దృశ్యాలు ఆధారంగా కూలింది ఎఫ్-15ఈ అని అధికారులు నిర్ధారించారు. దీని ఖరీదు రూ. 270 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉంది. కువైట్‌లోని రిఫైనరీపై భీకర దాడులు చేసింది. మినా అల్ అహ్మదీ రిఫైనరీపై శుక్రవారం ఉదయయే ఇరాన్ డ్రోన్ల ద్వారా దాడులు జరిపి ధ్వంసం చేసింది. దీంతో రిఫైనరీలోని మూడు యూనిట్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ దాడిలో ఎవరూ గాయపడ లేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రిఫైనరీపై దాడి జరగడం మూడోసారని అల్ జజీరా మీడియా తెలిపింది. అలాగే కువైట్‌లోని డీశాలినేషన్ ప్లాంట్‌పై కూడా ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడి ఎక్కడ జరిగిందీ వివరాలు తెలియరాలేదు. అయితే తాము ఈ దాడి చేయలేదని ఐఆర్జీసీ స్పష్టం చేస్తూ, దీనికి ఇజ్రాయెలే కారణమని ఆరోపించింది.
టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ హెడ్‌క్వార్టర్స్‌పై కచ్చితమైన దాడి నిర్వహించినట్టు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడిలో మొసాద్ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అయితే దీనిని ఇజ్రాయెల్ అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఇరాన్ దాడుల క్రమంలో తమ హబ్షాన్ గ్యాస్ సౌకర్యాలను నిలిపివేసినట్టు అబుదాబి ప్రకటించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదని తెలిపింది.
ఒక వైపు 30 వేల మందికి ఉద్వాసన పలికి టెక్ సంస్థ ఒరాకిల్ ప్రకంపనలు సృష్టించగా, దానిపై దాడి చేసి ఇరాన్ సంచలనం సృష్టించింది. దుబాయ్‌లోని ఒరాకిల్, బహ్రెయిన్‌లోని అమెజాన్ సంస్థల డాటా సెంటర్లపై ఐఆర్జీసీ దాడులు చేసినట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ వార్తలను యూఎస్ అధికారులు ఖండించగా, బహ్రెయిన్‌లోని అమెజాన్ డాటా సెంటర్లపై దాడిని అమెజాన్ నిర్ధారించింది.
క్షిపణి శకలాలు పడి అబుదాబిలో శుక్రవారం ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. శత్రు దేశ ఆయుధాలను అడ్డుకునే క్రమంలో అజ్బాన్లో శకలాలు పడి పలువురు గాయపడ్డారని, అందులో ఐదుగురు భారతీయులకు స్వల్పంగా గాయాలైనట్టు సమాచారం.