వాషింగ్టన్ : హొర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకాశ్రయాలను అమెరికా దిగ్బంధించడం వల్ల ఆ దేశానికి రోజుకు రూ.4,081 కోట్ల ఆర్థిక నష్టం జరగొచ్చని వాల్‌స్ట్రీట్ జర్నల్ అంచనా వేసింది. ఈ దిగ్బంధనం చమురు, ఎరువులు, ఆహారం ఇతర వస్తువుల సరఫరాకు అంతరాయం కలిగిస్తుందని.. అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని తెలిపింది. అమెరికా చేసే దిగ్బంధనం ఎంత పటిష్టంగా ఉంటుంది.. హొర్ముజ్కు అవతల జాస్క్ టెర్మినల్ ద్వారా ఇరాన్ తన చమురు ఎగుమతులను ఏ మేరకు మళ్లించగలదనే అంశాలపై ఇరాన్‌కు సంభవించే నష్టం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే గల్ఫ్‌కు ఆవల సరఫరా అవుతున్న 15.4 కోట్ల బ్యారెళ్ల చమురు అమ్మకాలతో ఇరాన్ తన నష్టాన్ని భర్తీ చేసుకొనే అవకాశం ఉన్నది. ఇంధన వాణిజ్యం ద్వారా వచ్చే నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా ఇరాన్‌పై గరిష్ఠ స్థాయిలో ఒత్తిడిని పెంచాలని అమెరికా యోచిస్తున్నది.
హొర్ముజ్ జల సంధిని దిగ్బంధించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సౌదీ అరేబియా మంగళవారం అమెరికాను ఒత్తిడి చేసింది. దిగ్బంధనం వల్ల ప్రపంచ నౌకా మార్గాలకు అంతరాయం కలుగుతుందని.. ఈ నేపథ్యంలో మరోసారి ఇరాన్‌తో చర్చలు జరపాలని కోరింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఎర్ర సముద్రంలో సౌదీ చమురు ఎగుమతులకు కీలకమైన బాబ్ అల్-మండేబ్ జలసంధిని ఇరాన్ లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నది.