Death Sentence | ఇరాన్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు విధించే మరణశిక్ష అమలు ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా బ్రిటన్ పౌరుడు అలీరెజా అక్బరీకి ఇరాన్లో మరణశిక్ష విధించారు. పెర్ఫ్యూమ్ బాటిల్, షర్ట్ వంటి చిన్న చిన్న గిఫ్ట్‌లకు బదులుగా నిఘా సమాచారాన్ని అందించారని అలీరెజాపై ఆరోపణలు ఉన్నాయి.
తన కుటుంబాన్ని చివరిసారిగా కలుసుకోవాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వం చెప్పిందని అలీరెజా భార్య మరియం చెప్తున్నారు. నిజానికి, అలీరెజా కొన్ని సంవత్సరాల క్రితమే బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. దీంతో గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేసిన అలీరెజాను వెంటనే విడుదల చేయాలని ఇంగ్లండ్ డిమాండ్ చేస్తూ వచ్చింది. అలీ రెజాకు ఉరిశిక్ష విధించడం రాజకీయ ప్రేరేపితమని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ ట్వీట్ చేశారు. 1997 నుంచి 2005 వరకు రక్షణ మంత్రికి అలీరెజా డిప్యూటీగా కొనసాగారు. ఈ సమయంలోనే అలీరెజా గూఢచర్యం చేశారని ఇరాన్ ఆరోపిస్తున్నది.
చాలా ఏండ్లపాటు తాను ఇరాన్ బయట ఉన్నానని, 2019 లో చర్చలకు పిలిస్తే వెళ్లగా తనను అరెస్ట్ చేసినట్లు అలీరెజా చెప్పారు. తనను నిఘా వర్గాలకు చెందిన అధికారులు 3500 గంటల పాటు విచారించారని ఆయన తెలిపారు. తనును తీవ్రంగా హింసిస్తూ గూఢచర్యం చేసినట్లుగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన మాటల క్యాసెట్ ఓ వార్తా సంస్థకు చేరడంతో ఆయనను వేధిస్తున్న విషయం బయటకు వచ్చింది. కాగా, అలీరెజా అక్బరీ దేశంలోని అతిపెద్ద చొరబాటుదారుల్లో ఒకరని ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వశాఖ అభివర్ణించింది.