Iran–US : అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శాశ్వతంగా కాల్పుల విరమణ కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాల్పలు విరమణపై ఇరాన్‌కు అమెరికా ప్రతిపాదనలు పంపింది. తొమ్మిది అంశాలతో అమెరికా ప్రతిపాదనలు పంపింది. దీనిపై ఇరాన్ స్పందించింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ద్వారా అమెరికాకు తన అభిప్రాయం తెలిపింది.
14 అంశాలతో ఇరాన్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కావాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధాన్ని కూడా ఆపాలని, హార్ముజ్ గుండా నౌకల రవాణాకు తగిన భద్రత కల్పించాలని ఇరాన్ కోరుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాల్పుల విరమణ కావాలని డిమాండ్ చేస్తోంది. అలాగే, ఈ ప్రాంతం నుంచి అమెరికా దళాలు పూర్తిస్థాయిలో వైదొలగాలని కూడా కోరుతోంది. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేస్తోంది. తమ భూతలంపై ఇరాన్ దాడి చేస్తోందని యూఏఈ ఆరోపిస్తోంది.
ఇదే సమయంలో తమ దేశంపై దాడులకు దిగితే, తిరిగి ప్రతిదాడులకు వెనుకాడబోమని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమ ప్రజల్ని రక్షించుకునేందుకు మళ్లీ దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ నౌకలపై అమెరికా దాడులు చేస్తే తాము కూడా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.