Mossad | టెహ్రాన్: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొస్సాద్’ పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. శత్రువులను అంతమొందించేందుకు సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆ సంస్థ దిట్ట. అందులో హనియా హత్య కూడా ఒకటి. ఆయన నివాసంపై పక్కా ప్లాన్‌తో రాడార్ గుర్తించలేని, గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేని ఏఆర్ఆర్డబ్ల్యూ హైపర్‌సానిక్ క్షిపణి ద్వారా తన పని పూర్తి చేసింది. ఇది గతంలో ఆ సంస్థ చేపట్టిన ‘ఏజెంట్ శ్యాడ్నెస్’ వంటి ఆపరేషన్లను గుర్తుచేసింది. తాజా ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను మొస్సాద్ మాజీ ఏజెంట్ డార్క్ వెబ్‌లో ఉంచారు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికి హాజరుకావడంతోపాటు ఆ దేశ రక్షణ శాఖ మంత్రితో భేటీ కోసం ఖాతార్ రాజధాని దోహా నుంచి ఇరాన్‌కు వెళ్లనున్న ఇస్మాయిల్ హనియాను హతమార్చాలని మొస్సాద్ ప్లాన్ వేసింది. మొస్సాద్ హెడ్ డేవిడ్ బర్నియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మొస్సాద్ ఏజెంట్ యాక్టివేట్ అయ్యాడు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించలేని, సకాలంలో తిప్పికొట్టలేని విధంగా దాడి చేయడం ద్వారా హనియాను చంపాలని ప్లాన్ వేసింది. లాక్‌హెడ్ ఏఆర్ఆర్డబ్ల్యూ హైపర్‌సానిక్ క్షిపణిని ఎంపిక చేసుకొన్నది. దీనికి సెకనుకు మైలు దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. దీన్ని ఏ రాడార్ వ్యవస్థ గుర్తించలేదు సరికదా.. ఏ రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు. ఒక భవనాన్ని కూల్చగల వార్‌హెడ్‌ను ఈ క్షిపణి మోయగలదు.
మొస్సాద్ ఏజెంట్ టెహ్రాన్‌లోని హనియా నివాసం ముందు కారు చేయాలి. ఆ కారులోని ఆడియో సిస్టమ్‌లో ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. హనియా ఇంట్లో నుంచి బయటకు రాగానే రిమోట్ ద్వారా ట్రాన్స్మిటర్ను యాక్టివేట్ చేయడం ద్వారా ఇరాన్ సరిహద్దుకు ఆవల ఉన్న ఇజ్రాయెల్ మిస్సైల్ బంకర్‌కు సిగ్నల్ పంపుతుంది. వెంటనే అక్కడున్న వాళ్లు క్షిపణిని ప్రయోగించాలి.
ప్లాన్ ప్రకారం మొస్సాద్ ఏజెంట్ కారును హనియా నివాసం సమీపంలో వదిలేసి వెళ్లాడు. అయితే కారును గుర్తించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు. కొద్ది నిమిషాల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి హనియా నివాసానికి తిరిగి వచ్చారు. అప్పటికే యాక్టివేట్ అయిన ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్ రావడంతో హైపర్‌సానిక్ క్షిపణి గంటలకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. టెహ్రాన్ చేరుకొనేందుకు 16 నిమిషాలు తీసుకొన్న ఆ మిస్సైల్.. హనియా నివాసాన్ని కూల్చివేసింది. ఆ నివాసంలో ఉన్న హనియాను ఈ విధంగా మొస్సాద్ హతం చేసింది.