Strait Of Hormuz : హార్ముజ్ జలసంధి మూసివేతతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అది పాక్షికంగానే. అందులోనూ నౌకల రవాణాకు అనేక షరతులు వర్తిస్తాయి. తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని మాత్రమే ఈ జలసంధి నుంచి అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ)కు ఇరాన్ ఒక లేఖ ద్వారా తెలిపింది.
తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని, తమ దేశ రక్షణ, భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటే మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి కార్యకలాపాలతో సంబంధం ఉండకూడదు. ఇరాన్‌తో కలిసి సమన్వయం చేసుకుని నౌకల్ని రవాణా చేసుకోవాలి. ఇక ఇజ్రాయెల్, అమెరికాలకు చెందిన ఎలాంటి నౌకల్ని ఇరాన్ ఈ జలసంధి మార్గంలో అనుమతించదు. మరోవైపు ఇప్పటికే ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ పన్ను వసూలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకలు తక్కువ సంఖ్యలోనే కదులుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ఈ మార్గం ద్వారా సాగే రవాణా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైంది.
ప్రపంచంలో ఐదోవంతు చమురు ఈ మార్గం నుంచే రవాణా అవుతుంది. చమురుతోపాటు ఆహారం, మెటల్స్, పారిశ్రామిక ఉత్పత్తులు వంటివెన్నో ఈ మార్గం ద్వారా వెళ్తుంటాయి. అలాంటి మార్గం ఇప్పుడు స్తంభించిపోవడంతో రవాణా ఆగిపోయింది. దీంతో అనేక దేశాలు చమురు కొరత ఎదుర్కొంటున్నాయి. ఆహారం సంక్షోభం మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే ఈ మార్గం త్వరగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలని అనేక దేశాలు కోరుకుంటున్నాయి.