Iran Protest | ఇరాన్లో ఖమేనీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 2571 మంది మృతిచెందినట్లుగా అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. వీరిలో 2,403 మంది ఆందోళన కారులు కాగా, 147 మంది భద్రా సిబ్బంది, ప్రభుత్వానికి చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. ఆందోళనలతో సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది సాధారణ పౌరులు కూడా చనిపోయారని పేర్కొంది.
కాగా, ఆందోళనల్లో 2 వేల మంది మరణించినట్టు స్వయంగా ప్రభుత్వమే అంగీకరించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ సంఖ్యను విపక్షాల అనుకూల వెబ్సైట్ ఇరాన్ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ భద్రతా దళాల చేతుల్లో 12 వేల మందికి పైగానే ఇరాన్ పౌరులు మరణించారని వెల్లడించింది. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతి పెద్ద మారణ హోమంగా అభివర్ణించింది. ఇరాన్ ప్రభుత్వం సొంత భద్రతా సంస్థలు, ఇతర సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ మృతుల సంఖ్యను పేర్కొన్నట్టు ఈ వెబ్సైట్ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్పై నిషేధం అమలువుతున్నందున పూర్తి సమాచారం అందడం లేదని, అందుకే మృతుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని ఒక ఇరాన్ అధికారి తెలిపారు. అయితే ఏ ఉగ్రవాదులు వారిని చంపారో ఆయన వివరించలేదు.