Erfan Soltani : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లర్లలో హింసకు పాల్పడ్డాడనే కారణంతో ఎర్ఫాన్ సోల్తాని అనే 26 ఏళ్ల యువకుడిని ఉరి తీయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా బుధవారం రోజే ఉరితీయాలని నిర్ణయించారు. కచ్చితమైన సమయం తెలియకపోయినప్పటికీ అతడ్ని ఈరోజే ఉరితీయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.
ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడితోపాటే మరికొందరు నిరసనకారుల్ని కూడా ఉరితీస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఇరాన్ మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి. గత 20 రోజులుగా ఇరాన్ లో ప్రజలు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా, కరెన్సీ విలువ పడిపోవడం, నిత్యావసరాల ధరలు పెరగడం వంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలు నిరన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, భద్రతా దళాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కొందరు భద్రతా సిబ్బంది సహా 2000 మంది వరకు మరణించారు. ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆందోళనకారుల్లో కొందరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఎర్ఫాన్ సల్తోని ఒకరు. అతడితోపాటు, అతడి కుటుంబాన్ని కూడా పోలీసులు ఈ నెల 8న అదుపులోకి తీసుకున్నారు.
ఇంతలోనే అతడు నేరానికి పాల్పడ్డాడని ఉరి శిక్ష ఖాయం చేశారు. ఈ రోజే ఉరితీయనున్నారు. అయితే, అతడిపై మోపిన నేరారోపణలపై స్పష్టత లేదు. మరోవైపు సరైన విచారణ జరగకుండానే, అరెస్టు చేసిన వారంలోపే అతడిని ఉరి తీస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కాపాడేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నా.. భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయి. మరోవైపు అవసరమైతే అతడి కుటుంబ సభ్యులు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎర్ఫాన్ కు మరణశిక్ష విధిస్తే.. తాజా ఆందోళనల అనంతరం తొలి ఉరి శిక్ష ఇదే అవుతుంది. మరోవైపు ఆందోళనకారుల్ని చంపితే ఊరుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు.