న్యూఢిల్లీ : సముద్ర మందుపాతరల ముప్పును తప్పించుకోవడంలో నౌకలకు సహాయపడే లక్ష్యంతో హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ కొత్త నౌకాయాన సూచనలను జారీచేసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ప్రవహించే కీలకమైన నౌకామార్గంలో కొత్త మ్యాప్‌లు నౌకా రవాణాను నిర్దేశిత మార్గాల ద్వారా నడిపిస్తాయి. హొర్ముజ్ జలసంధి నౌకల రాకపోకలకు పూర్తిగా తెరిచి ఉందో లేదో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ ఈ కీలక జలమార్గాన్ని మూసివేసినట్లు బుధవారం రాత్రి వార్తలు వెలువడ్డాయి. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని ఇరాన్ భావిస్తున్నది. బుధవారం తెల్లవారుజామున ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై తమ సైనిక దాడిని నిలిపివేయాలి. ఇందుకోసం హొర్ముజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాశ్వత శాంతి కోసం చర్చలు జరిపేందుకు వీలుగా ఈ రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
స్థానిక మీడియా ప్రచురించిన ఒక ప్రకటనలో సముద్ర భద్రతను పాటించి, సముద్ర మైన్లను నివారించడానికి నౌకలు సవరించిన ట్రాఫిక్ నమూనాలను తప్పనిసరిగా పాటించాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ పేర్కొన్నది. వాణిజ్య నౌకలకు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో నిర్దిష్ట ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఐఆర్జీసీ సూచించింది. జలసంధి గుండా ప్రయాణించే సమయంలో తమ దళాలతో సమన్వయం చేసుకోవాలని కూడా ఐఆర్జీసీ నేవీ నౌకలను కోరింది. కాగా, హొర్ముజ్ జలసంధిని పాక్షికంగా తిరిగి శుక్రవారం తెరువనున్నట్లు ఇరాన్ అధికారి ఒకరు తెలిపారు. దీర్ఘకాలిక శాంతి ఒప్పందంలో హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ విధించే అంశం ఉంటుందని ఆయన సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను ఒమన్ వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. అయితే హొర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు తాము, ఇరాన్ కలసి టోల్ వసూలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పడం విశేషం.